- మొన్న డీసీసీ, తాజాగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆశించి భంగపడ్డ జువ్వాడి సోదరులు
- వెల్మ సామాజికవర్గ నేతలకు మరోసారి మొండిచేయి
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా సంగనభట్ల దినేశ్ నియమించడమే ఇందుకు ఊతమిచ్చింది. ఈ నియామకం చుట్టూ జరిగిన పరిణామాలు వెల్మ వర్గంలో అసంతృప్తికి దారి తీసినట్లు తెలుస్తోంది.
సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావుకు డీసీసీ చీఫ్‌గా అవకాశం రాకపోవడంతో, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగారావు, తదితర నాయకులు కలిసి కృష్ణారావు పేరును లైబ్రరీ చైర్మన్ పదవికి సిఫార్సు చేశారు.
ఈ ఇద్దరు నేతలు వెల్మ సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో, తమ వర్గానికి ఈసారైనా ప్రాధాన్యత లభిస్తుందని ఆశించారు. కానీ, చివరికి స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మరో మంత్రి సాయంతో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సంఘనబట్ల దినేశ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బల్దియా ఎన్నికల్లో సంగనభట్ల దినేశ్ సతీమణి కౌన్సిలర్‌గా గెలవడంతో మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి ఆశించారు.
కానీ, పద్మశాలి వర్గానికి చెందిన నాగలక్ష్మికి కేటాయించడంతో దినేశ్అలక పూనినట్లు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను బుజ్జగించేందుకు గ్రంథాలయ చైర్మన్ పదవి కట్టబెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులుగా, పీసీసీ, డీసీసీ చీఫ్లుగా చక్రం తిప్పిన వెల్మ సామాజికవర్గాన్ని కాంగ్రెస్హైకమాండ్వరుసగా దూరం పెట్టడం విశ్లేషకులను సైతం విస్మయపరుస్తోంది. అటు డీసీసీ పదవి దక్కకపోవడం, ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్ పదవిలోనూ నిరాశ ఎదురవడంతో జువ్వాడి సోదరులు సైతం నారాజ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
